శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
అందరికి నమస్కారం! నా మొట్టమొదటి బ్లాగుపోస్టు (blogpost), విఘ్నహర్త వినాయకుడిని మరియు నా ఇష్టదైవం షిరిడి సాయిబాబా వారిని శ్రద్ధ, భక్తులతో నమస్కరించుకొని మొదలుపెడుతున్నాను.
నేను ముందుగా చెప్పదలుచుకున్న ఈ కథ అందరికి చిన్నప్పుడు అమ్మమ్మలో, నాన్నమ్మలో, తల్లితండ్రులో చెప్పుంటారు. చిన్నపిల్లలు చాలా ఇష్టపడే దేవుడు, ఇంకా మాటలు సరిగ్గా రాని పిల్లలకు ముద్దుగా తొండం స్వామి అని చెప్తుంటారు. ఇప్పుడు అందరికి గుర్తొచ్చిందా కథ? అదేనండి మన బుజ్జి గణపయ్య జననం. నేను అందరిలాగే మా పాపను జోకొడుతూ ఈ కథ చెప్పాను. పార్వతి దేవి నలుగుపిండితో బొమ్మను చేసి, ప్రాణం పోసి, ద్వారానికి కాపలాపెట్టి వెళ్ళటం, పరమేశ్వరుడు రావటం, బాలుడిని లోపలకు వెళ్ళటానికి దారివ్వమని అడగటం, ఆఖరకు ఏమి జరిగిందో మనందరికీ తెలిసినదే.
ఇక అసలు ట్విస్ట్ ఇక్కడేనండి. మా అమ్మాయి కథంతా చాల బాగా విని, నన్నో ప్రశ్న అడిగింది. "అమ్మ, పార్వతి దేవికి చాలా మహిమలు ఉన్నాయి కదా, మరి పార్వతి దేవి బాబు తల ఎందుకు అతికించలేదు"? (Amma, you said that Parvathi Devi has many powers and she created a boy. Then why didn't she attach the boy's head? - this was the word to word question that she asked). అప్పుడు తన వయస్సు మూడున్నర సంవత్సరాలు. ఇది విని నోరు వెళ్ళబెట్టటం ఈ సారి నా వంతయ్యింది😆😆.
మా పాపను పడుకోబెట్టేందుకు నేను ఈ కథ చెప్పాను. తనకు ఇది ఒక కథ మాత్రమే, కానీ తన చిన్న ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. చిన్నపిల్లల్లో చాలా కుతూహలం, సృజనాత్మకత ఉంటాయి. కొన్ని విషయాల్లో చిన్నపిల్లలా ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. కానీ వయస్సు పెరిగేకొద్దీ మన ఆలోచనా దృక్పథం ఎంత మారిపోతుందో కదా!
ఇవ్వాళ్టికి అదండీ సంగతి!
